సల్మాన్ తో స్నేహమే ప్రాణసంకటంగా మారుతోందా?
ఒకప్పుడు ముంబై మహానగరంలో అండర్ వరల్డ్ డాన్ల పేర్లు చెబితే సినీ తారలు ఉలిక్కిపడేవారు. కాగా , ఇప్పుడు కాలం మారింది. గుజరాత్‌లోని అత్యంత కట్టుదిట్టమైన సబర్మతి జైలులో ఖైదీగా ఉన్న ఒక గ్యాంగ్‌స్టర్.. బయట దేశ ఆర్థిక రాజధానిలో నెత్తురు పారిస్తున్నాడు. అతనే లారెన్స్ బిష్ణోయ్. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టార్గెట్‌గా దశాబ్దాల క్రితం మొదలైన ఇతని ప్రతీకార జ్వాల, ఇప్పుడు సల్మాన్ సన్నిహితులను, సహచరులను సైతం దహించివేస్తోంది. నిన్న ముంబై జుహూ ప్రాంతంలో యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటనే ఈ మారిన ముంబై అండర్ వరల్డ్ సమీకరణాలకు ప్రత్యక్ష సాక్ష్యం.
ప్రతీకారానికి కేంద్ర బిందువు ‘కృష్ణ జింక’
లారెన్స్ బిష్ణోయ్ ఆగ్రహానికి మూలకారణం 1998 నాటి ‘కృష్ణ జింక’ వేట కేసు అనేది ప్రధాన కారణంగా కనిపిస్తుంది . బిష్ణోయ్ వర్గం వారు కృష్ణ జింకలను దైవసమానంగా ఆరాధిస్తారు. ఆ జింకను వేటాడిన సల్మాన్ ఖాన్.. తమ కమ్యూనిటీకి బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నది బిష్ణోయ్ డిమాండ్. దానికి సల్మాన్ ససేమిరా అనడంతో అప్పట్లో మొదలైన వైరం, ఇప్పుడు బాలీవుడ్‌ను శాసించే స్థాయికి చేరుకుంది. కేవలం సల్మాన్‌ను మాత్రమే కాకుండా, అతనికి అండగా నిలబడే వారందరినీ మట్టుబెట్టడం ద్వారా సల్మాన్‌ను మానసికంగా ఒంటరిని చేయాలన్నది బిష్ణోయ్ తాజా వ్యూహంగా కనిపిస్తోంది.
బాబా సిద్ధిఖీ నుంచి టైగర్ ష్రాఫ్ వరకు..
సల్మాన్ ఖాన్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని ఇటీవల దారుణంగా హత్య చేయడం ద్వారా బిష్ణోయ్ గ్యాంగ్ తమ ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టింది. ఆ నెత్తుటి మరకలు ఆరకముందే, తాజాగా టైగర్ ష్రాఫ్ కారుపై (BMW) పక్కా ప్లాన్‌తో దాడికి తెగబడ్డారు. టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ, ఈ ఘటన బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ దాడి వెనుక ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేదా వ్యక్తిగత కక్షలు లేవు. కేవలం “సల్మాన్‌తో కలిసి పనిచేయవద్దు” అని తాము ఇచ్చిన హెచ్చరికలను టైగర్ ష్రాఫ్ ఖాతరు చేయకపోవడమే ఈ దాడికి ఏకైక కారణమని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రతినిధులు సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా ప్రకటించడం గమనార్హం
జైలు గోడల మధ్య నుంచి ‘కార్పొరేట్ క్రైమ్’ సిండికేట్..
ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన, ఆందోళనకరమైన విషయం లారెన్స్ బిష్ణోయ్ ఆపరేటింగ్ స్టైల్. జైలు నాలుగు గోడలకే పరిమితమైన ఒక వ్యక్తి, ముంబైలో ఎప్పుడు, ఎవరిపై, ఎక్కడ దాడి జరగాలో సెకన్ల వ్యవధితో సహా ప్లాన్ చేస్తున్నాడు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు కెనడా, అమెరికా వరకు విస్తరించిన ఇతని నెట్‌వర్క్‌లో దాదాపు 700కు పైగా వృత్తిపరమైన షార్ప్ షూటర్లు ఉన్నారని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. సిద్ధూ మూసేవాలా హత్య, గెలాక్సీ అపార్ట్మెంట్స్ వెలుపల కాల్పులు, ఇప్పుడు టైగర్ ష్రాఫ్‌పై ఎటాక్.. ఇవన్నీ జైలు నుంచే అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ లాంటి అనుచరుల ద్వారా పక్కాగా అమలవుతున్నాయి.
ఇది పోలీసు వ్యవస్థకు సవాల్..!
ఒకప్పుడు ముంబై పోలీసుల ఎన్కౌంటర్ల దెబ్బకు అండర్ వరల్డ్ మాఫియా దేశం విడిచి పారిపోయింది. కానీ, నేటి బిష్ణోయ్ గ్యాంగ్ టెక్నాలజీని, సోషల్ మీడియాను వాడుకుంటూ యువతను బ్రెయిన్ వాష్ చేసి తమ క్రైమ్ సిండికేట్‌లో చేర్చుకుంటోంది. దాడి చేసిన వెంటనే బాధ్యత ప్రకటిస్తూ భయాన్ని ఒక బ్రాండ్‌గా మార్చుకుంటోంది.
టైగర్ ష్రాఫ్‌పై జరిగిన దాడి కేవలం ఒక నటుడిపై జరిగిన అటెంప్ట్ మాత్రమే కాదు.. దేశ ఆర్థిక రాజధానిలో శాంతిభద్రతలకు, వ్యవస్థల వైఫల్యానికి ఒక సజీవ ఉదాహరణ. లారెన్స్ బిష్ణోయ్ ఆపరేషన్స్‌ను అడ్డుకోకపోతే, రాబోయే రోజుల్లో బాలీవుడ్ మాత్రమే కాదు, రాజకీయ, వ్యాపార రంగాలు కూడా ఈ ‘నెట్వర్క్’ గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు…
Post Views: 5









