తెలంగాణ కాబోయే సీఎం ఎవరు. ఎన్నికల్లో మేజిక్ ఫిగర్‌ను దాటేసిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం ఎంపికపైన కసరత్తు చేస్తోంది. పార్టీ తరపున గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలతో కూడిన శాసనసభాపక్షం కాసేపటట్లో సమావేశం కానుంది. సీఎం పదవి కోసం ప్రధానంగా ముగ్గురు పోటీ పడుతున్నారు. అన్నీ అనుకూలిస్తే..అధిష్టానం వెంటనే నిర్ణయం తీసుకుంటే సోమవారం సాయంత్రమే కొత్త సీఎంగా రేవంత్ ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది.
రేవంత్ వైపే మొగ్గు: కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో అధిష్టానం నియమించిన ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్, దీపా మున్షి, అజేయ్‌కుమార్, కె. మురళీధరన్, జార్జిలు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. సీఎల్పీ భేటీలో ప్రధానంగా సీఎంగా ఎవరిని నియమించాలన్నదానిపైన అబ్బర్వర్లు పార్టీ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు.
అయితే కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం ఎవరి అభిప్రాయం వారు చెప్పి.. అంతిమంగా నిర్ణయాధికారం అధిష్టానికే అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేస్తుంటారు. సోమవారం నాటి సీఎల్పీ సమావేశంలోనూ ఏఐసీసీ పరిశీలకులకు ఎవరి అభిప్రాయం వారు చెప్పి.. నిర్ణయాధికారాన్ని అధిష్టానానికి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నట్లు చెబుతున్నారు.
ఏకాభిప్రాయం సాధ్యమేనా: మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని, ఏకగ్రీవ తీర్మానాన్ని ఏఐసీసీ పరిశీలకులు అధిష్టానానికి పంపనున్నారు. వాటిని పరిశీలించి అధిష్టానం వెంటనే నిర్ణయం తీసుకుంటే సోమవారం సాయంత్రమే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉండే చాన్స్ ఉంది.సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమై.. సంప్రదింపులు జరపాలనుకుంటే మాత్రం మరో రెండు రోజుల సమయం తీసుకుని నిర్ణయిస్తుందని అంటున్నారు.
మొత్తమ్మీద సోమవారం సాయంత్రంగానీ, లేకుంటే ఈ నెల 6న గానీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని చెబుతున్నారు. అయితే పార్టీలో ప్రజాకర్షణ ఉన్న నేత కావడం, టీపీసీసీ అధ్యక్షుడిగా పార్టీకి ఘనవిజయాన్ని సాధించి పెట్టడంతో సీఎంగా రేవంత్‌రెడ్డి పేరు వైపే హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

రేసులో ముగ్గురు నేతలు: రేవంత్‌రెడ్డి తర్వాత సీఎల్పీ మాజీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సోనియాగాంధీ జన్మదినం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిన రోజును పురస్కరించుకుని డిసెంబరు 9న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ సీఎం.. ప్రమాణ స్వీకారం చేస్తారని గతంలోనే రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ నెల 9 వరకూ ఆగితే.. కేంద్రంలోని అధికార బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ కలిసి హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని భావించిన అధిష్టానం.. వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో, ఈ రోజు జరిగే ఎమ్మెల్యేల సమావేశం సీఎం అభ్యర్ది ఎంపిక విషయంలో కీలకం కానుంది.









