భారతీయ సినీ చరిత్రలో ‘ధురంధర్ 2’ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ, బాక్సాఫీస్ వద్ద ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాదు అనుకున్న మైలురాయిని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1,812 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రాల జాబితాలో రెండవ స్థానానికి ఎగబాకి సంచలనం సృష్టించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’. ఈ చిత్రం అప్పట్లో సుమారు రూ.1,810 కోట్ల వసూళ్లతో ఇన్నాళ్లుగా రికార్డుల రారాజుగా కొనసాగింది. ఈ అసాధారణ రికార్డును ఇప్పట్లో ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదని ట్రేడ్ వర్గాలు సైతం భావించాయి. కానీ, అంచనాలను తలకిందులు చేస్తూ ‘ధురంధర్ 2’ మొదటి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోయి, ‘బాహుబలి 2’ లైఫ్‌టైమ్ కలెక్షన్లను అధిగమించి సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
తాజా కలెక్షన్ల నివేదికల ప్రకారం భారత సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 చిత్రాల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. చైనా వసూళ్లతో కలుపుకుని రూ.2,000 కోట్లకు పైగా వసూళ్లతో ‘దంగల్’ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. తాజా కలెక్షన్లతో ‘ధురంధర్ 2’ రెండో స్థానంలో నిలిచింది. దీంతో ‘బాహుబలి 2’ మూడో స్థానానికి పడిపోగా, ‘పుష్ప 2’ (రూ.1,742 కోట్లు), ‘ఆర్ఆర్ఆర్’ (రూ.1,300 కోట్లు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ‘ధురంధర్ 2’ ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ఈ వసూళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.









