బండి భగీరథ్‌ పోక్సో కేసులో బిగుస్తున్న ఉచ్చు: ముందస్తు బెయిల్ నిరాకరణ.. ఏ క్షణమైనా లొంగుబాటు!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ పోక్సో (POCSO) కేసు నేడు కీలక మలుపు తిరగబోతోంది. మే 8వ తేదీన నమోదైన ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భగీరథ్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పరిశీలించిన న్యాయమూర్తి, ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేశారు. దీంతో ఉచ్చు బిగుస్తుండటంతో, భగీరథ్‌ ఏ క్షణమైనా పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ కేసులో శుక్రవారం రాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రమంత్రి బండి సంజయ్ ముందుగా తన కుమారుడిని పోలీసుల ఎదుట లొంగిపోయేలా చేసి విచారణకు సహకరించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు వచ్చిన కొద్ది గంటల్లోనే అర్ధరాత్రి వేళ హైకోర్టు ముందస్తు బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చింది. కోర్టు తన తీర్పును వచ్చే వారానికి రిజర్వ్ చేసినప్పటికీ, అప్పటివరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్న నిందితుడి తరపు న్యాయవాది అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించడంతో ఆయనకు లొంగుబాటు తప్పనిసరిగా మారింది.

గత వారం రోజులుగా పరారీలో ఉన్న భగీరథ్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బాధితురాలు మైనర్ అనే విషయాన్ని స్వయంగా బండి సంజయ్ గతంలో సివిల్ కోర్టులో దాఖలు చేసిన గ్యాగ్ ఆర్డర్ పిటిషన్‌లో అంగీకరించడం ఈ కేసులో మరో కీలక అంశంగా మారింది. ఈ వ్యవహారం అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇటు బీజేపీకి రాజకీయంగా సవాలుగా మారగా, ఆధారాల సేకరణ వల్లే ఆలస్యమైందని, కేసును నీరుగార్చే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భగీరథ్‌ పోలీసుల ముందుకు రాగానే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు