పిల్లలన్నాక తప్పు చేస్తారు.. బండి సంజయ్ రాజీనామా డిమాండ్ సరికాదు: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి!

పోక్సో (POCSO) కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ అరెస్ట్ అయిన నేపథ్యంలో, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలనడం ఎంతమాత్రం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వివాదంలో బండి సంజయ్‌కు పూర్తి మద్దతుగా నిలిచారు. కొడుకు తప్పు చేస్తే తండ్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సరైన పద్ధతి కాదని, రాజకీయం కోసమే కొందరు ఈ అంశాన్ని రచ్చ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ తన కుమారుడిని దాచిపెట్టకుండా, చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు లొంగిపోయేలా చేసి బాధ్యతాయుతమైన తండ్రిగా వ్యవహరించారని మల్లు రవి కితాబిచ్చారు. ఒకవేళ కేంద్రమంత్రి తన పదవిని అడ్డుపెట్టుకుని కొడుకును రక్షించాలని చూస్తే తాము ఖచ్చితంగా వ్యతిరేకించేవాళ్లమని, కానీ ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుపోతోందని గుర్తుచేశారు. పిల్లలన్నాక అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారని, దాన్ని పట్టుకుని కేంద్రమంత్రి పదవి నుంచి ఆయన్ను దించేయాలని చూడటం వెనుక సొంత పార్టీలోని కొందరు నేతల రాజకీయ స్వార్థం కూడా దాగి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

ఇదే సందర్భంలో బీఆర్‌ఎస్ పార్టీపై మల్లు రవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్ళినప్పుడు ఆమె తండ్రి కేసీఆర్ గానీ, సోదరుడు కేటీఆర్ లేదా హరీశ్ రావు తమ పదవులకు రాజీనామాలు చేశారా? అని నిలదీశారు. అప్పుడు లేని నైతిక విలువలు ఇప్పుడు బండి సంజయ్ విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇలాంటి సున్నితమైన వ్యక్తిగత, కుటుంబ అంశాల్లో రాజకీయ పార్టీలన్నీ ముఠా రాజకీయాలకు అతీతంగా, విచక్షణతో వ్యవహరించాలని మల్లు రవి హితవు పలికారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు