హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ప్రముఖ షాపింగ్ డెస్టినేషన్ ‘లులూ హైపర్‌మార్కెట్’లో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఒక వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో అపరిశుభ్రత, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నమ్మలేని నిజాలు బయటపడటంతో అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. స్టోర్‌లోని వివిధ విభాగాల నుండి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దాదాపు 150 కిలోల పాడైపోయిన ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ వివరాలను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తన అధికారిక సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా పంచుకున్నారు.
తనిఖీల్లో భాగంగా అధికారులు హైపర్‌మార్కెట్‌లోని ఇన్-హౌస్ కిచెన్, రిటైల్ విభాగం మరియు మాంసం విక్రయశాలలను క్షుణ్ణంగా పరిశీలించారు. కిచెన్ ఏరియాలో పరిశుభ్రత అత్యంత దారుణంగా ఉందని, ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నాయని అధికారులు గుర్తించారు. రిటైల్ విభాగంలో విక్రయిస్తున్న శనగపిండి, గోధుమపిండి, వివిధ రకాల పప్పులలో పెద్ద ఎత్తున పురుగులు పట్టి ఉండటాన్ని గమనించారు. అంతేకాకుండా, గడువు తీరడానికి దగ్గరగా ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్‌పై పాత లేబుళ్లను చింపివేసి, తప్పుదోవ పట్టించే కొత్త లేబుల్స్ వేసినట్లు గుర్తించారు. మరికొన్ని ఉత్పత్తులపై అసలు ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ నంబర్, పోషక విలువల సమాచారం, తయారీదారుడి చిరునామా వంటి తప్పనిసరి వివరాలు లేకపోవడం గమనార్హం.
మరోవైపు, నాన్‌వెజ్ ప్రియులు ఎంతో నమ్మకంతో కొనుగోలు చేసే మాంసం (బుచరింగ్) విభాగంలోనూ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. మాంసం వ్యర్థాలను సక్రమంగా తొలగించకపోవడంతో అక్కడి డ్రైనేజీలు పూర్తిగా మూసుకుపోయి, ప్రాంగణమంతా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇది ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈ దాడుల అనంతరం పురుగులు పట్టిన స్వీట్లు, వంట నూనెలు, పిండి, పప్పులతో కూడిన 150 కిలోల ఆహార పదార్థాలను అధికారులు నాశనం చేశారు. కృత్రిమ రంగుల వాడకం, కల్తీ అనుమానాలతో సేకరించిన పలు నమూనాలను ల్యాబొరేటరీకి పంపించామని, నివేదిక రాగానే లులూ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.









