అమెరికా ఆవిష్కరణల పోటీలో టాంపా తెలుగమ్మాయి అద్భుత ప్రతిభ: జాతీయ స్థాయిలో ఇషాన్వికి ద్వితీయ బహుమతి!

అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ఆవిష్కరణల పోటీ ‘ఇన్వెన్షన్ కన్వెన్షన్ యూఎస్ నేషనల్స్’లో టాంపా నగరానికి చెందిన తెలుగు విద్యార్థిని ఇషాన్వి సబ్నివీసు అద్భుత విజయాన్ని సాధించి అంతర్జాతీయ వేదికపై తెలుగు తేజంగా మెరిసింది. ఫ్లోరిడాలోని స్టెయిన్‌బ్రెన్నర్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఇషాన్వి, అమెరికాలోని 35 రాష్ట్రాల నుండి పోటీ పడిన సుమారు 3 లక్షలకు పైగా విద్యార్థులను వెనక్కి నెట్టి జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతిని కైవసం చేసుకుంది. దృష్టి లోపం ఉన్నవారు ఎవరి సహాయం లేకుండా స్వతంత్రంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు ఆమె ఆవిష్కరించిన ‘AI-ఎనేబుల్డ్ స్మార్ట్ కేన్ (AI-powered Smart Cane)’ ఈ అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఈ వినూత్న ప్రాజెక్ట్ పేటెంట్ దరఖాస్తు దశలో ఉండటం విశేషం.

ఇషాన్వి రూపొందించిన ఈ స్మార్ట్ కేన్ పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) సాంకేతికతతో పనిచేస్తుంది. ఇందులో రియల్ టైమ్ ఏఐ వాతావరణ విశ్లేషణ, ఇంటర్నెట్ అవసరం లేని ఆన్-డివైస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) ప్రాసెసింగ్, మరియు బ్లూటూత్ ఇయర్పీస్ ద్వారా వాయిస్ మార్గనిర్దేశం చేసే అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, అడ్డంకులను ముందస్తుగా గుర్తించే (Obstacle Detection) వ్యవస్థతో పాటు ఒకే టచ్‌తో అత్యవసర కాల్స్ చేసుకునే సురక్షిత ఫీచర్లను కూడా ఇందులో పొందుపరిచారు. ఇంటర్నెట్ లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసేలా ఈ పరికరాన్ని రూపొందించారు.

ఈ ప్రాజెక్ట్ సక్సెస్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ ‘క్వాడ్రిక్ ఐటీ’ కీలక పాత్ర పోషించింది. ఇషాన్వి ఆలోచనను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి ఈ సంస్థ ఏఐ సాంకేతికతతో పాటు అవసరమైన మెంటారింగ్, సాంకేతిక సహాయాన్ని అందించింది. తన విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజానికి గర్వకారణమని ఇషాన్వి సంతోషం వ్యక్తం చేయగా, ఈ ఘనత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రవాస తెలుగువారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సామాజిక బాధ్యతగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కోసం ఇషాన్వి ‘క్రానిక్ కనెక్ట్’ అనే లాభాపేక్ష లేని (నాన్-ప్రాఫిట్) కమ్యూనిటీని కూడా స్థాపించి మరికొందరికి ఆదర్శంగా నిలిచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు