తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. ఈ అంశంపై బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం తమ స్వార్థ రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు ఈ పారదర్శక ప్రక్రియను రగడగా మారుస్తూ రాద్దాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సిద్ధిపేట జిల్లా కుక్కునూరుపల్లి మండలం మత్పల్లిలో గురువారం జరిగిన పార్టీ జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగినప్పుడు తాము పూర్తి స్థాయిలో మద్దతు తెలిపామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని రాంచందర్ రావు ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితా సవరణ అనేది కేవలం తెలంగాణకే పరిమితం కాలేదని, కేరళ, కర్ణాటక సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో నిరంతరాయంగా జరుగుతోందని గుర్తు చేశారు. ఓటర్లు ఏ నియోజకవర్గంలో నివసిస్తున్నారో.. ఖచ్చితంగా అక్కడే తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడటం, తద్వారా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడమే ఈ ప్రత్యేక సవరణ యొక్క ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఇప్పుడు ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందని, అందుకే ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దశాబ్ద కాలం పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువునా ముంచాయని ఆరోపించారు. ఈ రెండు ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ఉమ్మడిగా రైతులను, విద్యార్థులను, ఉద్యోగులను వంచించాయని, ప్రజా సమస్యలపై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.









