వరుస విజయాల వల్ల వచ్చిన స్టార్‌డమ్ మత్తులో తాను కూడా కొట్టుకుపోయానని, అది తనలో ఒక రకమైన అహంకారాన్ని పెంచిందని ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు వ్యాఖ్యానించారు. ఇటీవల అనారోగ్యం కారణంగా తీసుకున్న విరామం తన జీవితాన్ని, కెరీర్‌ను పూర్తిగా ఒక కొత్త కోణంలో చూసేలా చేసిందని ఆమె వెల్లడించారు. తాను నటించిన సరికొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో సమంత తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
చిన్న పట్టణం నుండి వచ్చిన ఒక సాధారణ అమ్మాయిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత అంతటి స్టార్‌డమ్‌ను అనుభవించడం తనకు ఎంతో ఆశ్చర్యంగా అనిపించిందని సమంత పేర్కొన్నారు. ఒక దశలో వరుసగా ఏడాదికి ఐదు సినిమాలు చేయడం, అవన్నీ సూపర్ హిట్ కావడంతో అందరూ తనను ‘గోల్డెన్ లెగ్’ అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాలకు తగ్గట్టుగా రాణించాలనే ఒత్తిడిని తానే స్వయంగా నెత్తిన వేసుకున్నానని, స్టార్‌డమ్ అనే ఆటకు పూర్తిగా బానిసనైపోయానని ఆమె ఒప్పుకున్నారు.
ఆ రోజుల్లో విపరీతమైన బిజీగా ఉంటూ ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని తాపత్రయపడేదాన్ని అని, నటిగా తనకు అసలు ముగింపే ఉండదనే అహంకార ధోరణిలో ఉన్నానని సమంత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, 2022లో మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడి తీసుకున్న బ్రేక్ వల్ల తన కెరీర్‌కూ ఒక ముగింపు ఉంటుందనే చేదు నిజాన్ని అర్థం చేసుకోగలిగానని చెప్పారు. ఆ విరామం తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిందని, తిరిగి సినిమాల్లోకి వచ్చేటప్పుడు కొన్ని పాత అలవాట్లను మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.









