డీటీఓ వెంకన్న మృతిపై హరీశ్‌రావు అనుమానాలు!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాహనాల తనిఖీలు చేస్తుండగా బొగ్గు టిప్పర్ లారీ ఢీకొని జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) వెంకన్న దుర్మరణం చెందిన ఘోర ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ రోడ్డు ప్రమాదం కేవలం అనుకోకుండా జరిగింది కాదనే బలమైన సందేహాన్ని ఆయన లేవనెత్తారు. రాష్ట్రంలో ఇసుక, బొగ్గు మాఫియాల అక్రమ దందాలు మితిమీరిపోయాయని, నిజాయతీగా పనిచేసే అధికారులు అడ్డొస్తే ఇలా లారీలతో తొక్కించి ప్రాణాలు తీస్తారా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

భూపాలపల్లి ఏరియాలో సాగుతున్న అక్రమ ఇసుక, బొగ్గు రవాణా వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? వారికి సహకరిస్తున్న లీడర్స్ ఎవరు? అనే పూర్తి వివరాలను ప్రభుత్వం తక్షణమే బయటపెట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కేవలం లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటే కుదరదని, దీని వెనుక ఎవరి ప్రేరేపణ అయినా ఉందా అనే కోణంలో ఉన్నత స్థాయి సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర సర్కార్‌ను కోరారు.

ఈ ప్రమాదంపై విచారణకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, విధుల్లో ఉండే అధికారులకు ఇలాంటి దారుణాలు జరగకుండా పకడ్బందీ రక్షణ చర్యలు తీసుకోవాలని, దోషులను కఠినంగా శిక్షించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కేవలం ఇరవై రోజుల క్రితమే జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చిన ఒక నిజాయతీ గల అధికారి ఇలా ప్రాణాలు కోల్పోవడం వెనుక దాగిన నిజాన్ని పూర్తిగా వెలికితీయాల్సిన బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వంపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు