టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరికొత్త అవతారమెత్తారు. ఇప్పటివరకు తన నటన, అద్భుతమైన డాన్సులతో ప్రేక్షకులను అలరించిన రామ్.. ఇప్పుడు దర్శకుడిగా మారి మెగాఫోన్ పట్టారు. ఆయన కథానాయకుడిగా నటిస్తూ, స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #RAPO23 సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆయన సోదరుడు కృష్ణ పోతినేని సరికొత్తగా స్థాపించిన ‘రాపో సినిమాటిక్స్’ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు రామ్ కుటుంబ సభ్యులు, చిత్ర యూనిట్ హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, రామ్ తండ్రి మురళీ పోతినేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకుడిగా మారిన రామ్ పోతినేని మొదటి షాట్‌కు స్వయంగా యాక్షన్ చెప్పి సినిమా షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. “ది లోన్ వోల్ఫ్ జర్నీ బిగిన్స్” (The Story of a Lone Wolf) అనే పవర్ఫుల్ క్యాప్షన్‌తో చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో చేసిన అధికారిక ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రం టాలీవుడ్లో అరుదుగా వచ్చే మైండ్ బ్లోయింగ్ ‘సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్’ జోనర్లో, నియో-నోయిర్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోంది. ఇందులో రామ్ “వీర” అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం పరిశ్రమలోని టాప్ టెక్నీషియన్లు రంగంలోకి దిగారు. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరు ఛాయాగ్రహణ బాధ్యతలు చేపట్టగా.. స్టార్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నారు. ఎ.ఎస్. ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.









