“నా భర్తకు చికిత్స చేయొద్దు”: వాంగ్‌చుక్‌ను ఆస్పత్రిలో చేర్చడంపై భార్య షాకింగ్ కామెంట్లు

నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను ఢిల్లీ పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. నిరంతర దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని, నిపుణులైన వైద్యుల సలహా మరియు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారమే ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, సోమవారం నాడు పార్లమెంట్ వైపు చేపట్టదలచిన భారీ నిరసన ప్రదర్శనకు సిద్ధమవుతున్న తరుణంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు ఈ చర్యకు పూనుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

తన భర్తను ఆసుపత్రిలో చేర్చడంపై సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జె ఆంగ్మో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గత 20 రోజులుగా తన భర్త ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న తమ వ్యక్తిగత వైద్యులు, కుటుంబ సభ్యుల లిఖితపూర్వక అనుమతి లేకుండా ఆయనకు నోటి ద్వారా గానీ, సెలైన్ రూపంలో గానీ ఎలాంటి మందులు లేదా చికిత్స అందించడానికి వీళ్లేదని ఆమె స్పష్టం చేశారు. నిన్నటి వరకు ఆయన చాలా ఆరోగ్యంగా, బాగానే కనిపించారని, ఆయన్ను అర్ధాంతరంగా ఆసుపత్రికి తీసుకురావాల్సిన అవసరమే లేదని ఆమె పేర్కొన్నారు. ఆర్టికల్ 32 ప్రకారం ఇది తమ ప్రాథమిక హక్కు అని నిలదీసిన ఆమె.. తమ సొంత వైద్యుడి పర్యవేక్షణ లేకుండా ఎలాంటి చికిత్స ప్రారంభించినా, ఒకవేళ ఆయనకు ఏమైనా జరిగితే దానికి ప్రతి ఒక్కరినీ బాధ్యులను చేస్తానని హెచ్చరించారు.

మరోవైపు, కఠిన దీక్ష కారణంగా సోనమ్ వాంగ్‌చుక్ సుమారు 9 కిలోల బరువు తగ్గారని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ ఆయన మాత్రం తన పట్టు వీడటం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన స్పందన రాకుండా దీక్షను విరమిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే జూలై 20వ తేదీన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో చేపట్టనున్న పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయాలని ఆయన శుక్రవారం రాత్రి తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. బాహ్యంగా తన శరీరం బలహీనపడినా అంతర్గతంగా చాలా బలంగా ఉన్నానని, ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌లో తమ విజ్ఞప్తిని వినిపించడానికి జూలై 20న అందరం కలిసి శాంతియుతంగా ముందుకు సాగాలని, ఆ రోజు మార్చ్ విజయవంతం కాకపోయినా తాను దయ్యంగానైనా తిరిగి వస్తానంటూ ఆయన కాస్త సరదాగా వ్యాఖ్యానించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు