రష్మిక మందన్నకు తీవ్ర గాయం: షూటింగ్‌లో ప్రమాదం ఎలా జరిగిందో రివీల్ చేసిన నేషనల్ క్రష్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల తనకు తగిలిన తీవ్ర గాయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అసలు విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన తాజా చిత్రం ‘మైసా’ (Mysaa) సినిమాకు సంబంధించిన ఒక భారీ డ్యాన్స్ సాంగ్ షూటింగ్ చిత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆమె తెలిపారు. డ్యాన్స్ మూమెంట్స్ చేస్తున్న క్రమంలో రైట్ హిప్ ఏరియాలో ‘టెండన్ డిటాచ్‌మెంట్’ (Tendon Detachment) జరిగిందని, ఇలాంటి తీవ్రమైన గాయం కావడం తన కెరీర్‌లో ఇది మూడోసారని ఆమె వివరించారు. ఈ అనుకోని సంఘటన కారణంగా తన సినిమాల షూటింగ్‌లకు తాత్కాలికంగా విరామం ఇవ్వాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

గాయం తర్వాత తన జీవన శైలిలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడిన రష్మిక, శరీరం ఇచ్చే సూచనలను గమనించడం ఎంత ముఖ్యమో వివరించారు. మనం మన శరీరాన్ని నిరంతరం ఒక యంత్రంలా కాకుండా, మనిషి శరీరంగా చూసుకోవడం నేర్చుకోవాలని ఈ సందర్భంగా ఆమె అభిమానులకు సూచించారు. ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు బెడ్ రెస్ట్ తీసుకుంటున్న రష్మిక.. ఈ బలవంతపు విరామం (Forced Break) సమయంలో మానసికంగా దృఢంగా ఉండటానికి పజిల్స్ పూర్తి చేస్తూ కాలక్షేపం చేస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చారు.

బెడ్ రెస్ట్‌లో ఉన్నప్పటికీ తన ఫిట్‌నెస్‌ దెబ్బతినకుండా, బరువు పెరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు మరియు ప్రత్యేక డైట్ తీసుకుంటున్నట్లు రష్మిక స్పష్టం చేశారు. ఈ హఠాత్ పరిణామంతో ఆమె నటిస్తున్న చిత్రాల షూటింగ్‌లు కాస్త ఆలస్యం కానున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, రష్మిక త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు మరియు ఆమె అభిమానులు పెద్ద ఎత్తున ‘గెట్ వెల్ సూన్’ మెసేజ్‌లు పెడుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు