టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన కలయికల్లో ఒకటైన దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) కాంబినేషన్‌కు బ్రేక్ పడనుందనే వార్తలు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సుకుమార్ తొలి చిత్రం ‘ఆర్య’ నుంచి నిన్నమొన్నటి ‘పుష్ప-2’ వరకు ప్రతీ సినిమాకూ దేవిశ్రీ ప్రసాదే సంగీతం సమకూర్చగా, తొలిసారిగా ఈ బంధం విడిపోనుందనే ప్రచారం సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రామ్ చరణ్ – సుకుమార్ కలయికలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘RC17’ కోసం DSP స్థానంలో కొత్త సంగీత దర్శకుడిని తీసుకునే యోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’ తో ఆకట్టుకున్న జాతీయ అవార్డు గ్రహీత శాశ్వత్ సచ్‌దేవ్‌ను (Shashwat Sachdev) ఈ ప్రాజెక్ట్ కోసం పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కొత్త రకం కథా నేపథ్యం, పాన్ ఇండియా శ్రోతలకు సరికొత్త మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతోనే సుకుమార్ ఈ కొత్త ప్రయోగం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
మరోవైపు, దేవిశ్రీ ప్రసాద్ కూడా సంగీతదర్శకత్వంతో పాటు నటుడిగా తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన ‘ఎల్లమ్మ’ అనే చిత్రంతో నటుడిగా అవతారమెత్తుతుండటంతో పాటు ‘KING100’, కార్తీ 30వ సినిమా వంటి పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఈ మార్పులపై సుకుమార్ టీమ్ నుంచి త్వరలోనే అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది.









