అప్పుడు క్లాప్ అసిస్టెంట్.. ఇప్పుడు అదే హీరోకి ప్రొడ్యూసర్: నానిది అసలైన విజయం!

ఒకప్పుడు క్లాప్ అసిస్టెంట్‌గా పనిచేసిన వ్యక్తి, రెండు దశాబ్దాల తర్వాత అదే హీరోతో సినిమా నిర్మించే స్థాయికి ఎదగడం సినీ పరిశ్రమలో ఒక స్ఫూర్తిదాయక పరిణామం. నేచురల్ స్టార్ నాని ప్రయాణం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. హీరో నితిన్ కథానాయకుడిగా, నాని సమర్పణలో ‘అలియాస్ రుక్మిణీ’ అనే కొత్త చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్నారు.
ఈ పూజా కార్యక్రమం సందర్భంగా ఓ ఆసక్తికరమైన పాత విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 21 ఏళ్ల క్రితం (2005లో) కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘అల్లరి బుల్లోడు’ సినిమాకు నాని క్లాప్ అసిస్టెంట్‌గా పనిచేశారు. అప్పట్లో నితిన్ షాట్స్‌కు క్లాప్ కొట్టిన నాని, ఇప్పుడు అదే నితిన్ సినిమాకు నిర్మాతగా మారి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టడం విశేషం. ఈ రెండు సందర్భాలకు సంబంధించిన ఫొటోలను పోలుస్తూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
దర్శకుడు కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని, లెజెండరీ డైరెక్టర్ బాపు, రాఘవేంద్రరావుల వద్ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ‘అష్టా చమ్మా’ చిత్రంతో హీరోగా మారి, స్వయంకృషితో రూ. 100 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్‌గా ఎదిగారు. హీరోగానే కాకుండా అభిరుచి గల చిత్రాలను నిర్మిస్తూ నిర్మాతగానూ రాణిస్తున్న నాని, త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితోనూ ఒక ప్రాజెక్ట్ చేయనుండటం ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు