అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాకు చెందిన ప్రముఖ మేధో మధన సంస్థ ‘సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్’ (CIS) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారతీయ విద్యార్థులకు జారీ చేసే ఎఫ్-1 (F-1) స్టూడెంట్ వీసాల సంఖ్యలో ఏకంగా 62 శాతం మేర కోత పడింది. 2024లో భారతీయులకు 58,694 వీసాలు మంజూరు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య భారీగా పడిపోయి కేవలం 22,149కి పరిమితమైంది. అమెరికా ఇమిగ్రేషన్ విధానాల్లో చోటుచేసుకున్న మార్పులు, వీసా ఇంటర్వ్యూల నిబంధనలను కఠినతరం చేయడమే ఈ తీవ్ర తగ్గుదలకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
ఈ వీసా నిబంధనల ప్రభావం కేవలం భారతదేశంపైన మాత్రమే కాకుండా ఇతర దేశాలపైనా పడింది. చైనా విద్యార్థులకు జారీ చేసే వీసాల్లో సైతం 34 శాతం మేర తగ్గుదల నమోదైంది. ఇలా వీసాల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల మొత్తం జనాభాలో ఇప్పటికీ భారత్, చైనాల నుంచే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ప్రతినిధులుగా కొనసాగుతున్నారు.
అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం వేచి చూస్తున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు ఈ కొత్త నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వీసా ప్రక్రియలో వచ్చిన మార్పుల వల్ల రాబోయే రోజుల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.









