డీలిమిటేషన్ ప్లాన్: తమిళనాడు ఎంపీలతో విజయ్ భేటీని బహిష్కరించిన డీఎంకే

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై శనివారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎంపీల సమావేశానికి హాజరుకాకూడదని డీఎంకే నిర్ణయించింది. కావేరీ జలాల వివాదం మరియు మేకెదాటు ఆనకట్ట సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే విజయ్ ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, ఇదొక కేవలం ప్రహసనం అని డీఎంకే రాజ్యసభ ఎంపీ కనిమొళి ‘ఎక్స్’ (X) వేదికగా తీవ్రంగా విమర్శించారు.

డీఎంకే ఇప్పటికే డీలిమిటేషన్ ప్రక్రియను దృఢంగా వ్యతిరేకిస్తోందని, గతంలో జరిగిన అఖలపక్ష సమావేశాల్లోనే తమిళనాడు వైఖరి ఏంటో స్పష్టం చేశామని కనిమొళి గుర్తుచేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదా సవరించిన ముసాయిదా బిల్లు రానప్పుడు, హడావుడిగా ఈ సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు.

కావేరీ అంశంపై నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో, ఆ సమస్యను పట్టించుకోకుండా టీవీకే (TVK) ప్రభుత్వం ఎంపీల భేటీ పేరిట నాటకాలు ఆడుతోందని డీఎంకే ఆరోపించింది. కావేరీ, మేకెదాటు ఆనకట్ట వివాదాలపైనే తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, తమిళనాడు రాజకీయ పార్టీల ఏకగ్రీవ డిమాండ్లను విస్మరించిన విజయ్ ప్రభుత్వ సమావేశాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు డీఎంకే స్పష్టం చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు