టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే నాని తన తదుపరి చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్‌తో చేయనున్నారు. ‘ఓజీ’ లాంటి భారీ క్రేజ్ తర్వాత సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం అక్టోబర్ నెల నుంచి పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నాని సరసన యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించనున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దర్శక నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరిపారని, సుజీత్ రాసుకున్న కథ మరియు తన పాత్ర రూపకల్పన నచ్చడంతో భాగ్యశ్రీ కూడా ఈ సినిమాకు సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
మోడలింగ్ రంగం నుంచి వచ్చి ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే, ఇటీవల అఖిల్ అక్కినేని సరసన ‘లెనిన్’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నాని సరసన ‘బ్లడీ రోమియో’లో ఆఫర్ అందుకోవడంతో ఆమె కెరీర్‌కు ఇది మరో పెద్ద మైలురాయి కానుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.









