లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ కేసులో బాలీవుడ్ దర్శకుడు షకీల్ నూరానీ అరెస్ట్

లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలపై బాలీవుడ్ దర్శక నిర్మాత షకీల్ నూరానీని ముంబైలోని మాల్వానీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా మేధా ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో దాక్కున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నూరానీ గతంలో ‘బడే దిల్ వాలా’ (1999), ‘జోరు కా గులామ్’ (2000) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

FIRలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2016లో లోఖండ్‌వాలాలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో నూరానీతో బాధిత నటికి పరిచయం ఏర్పడింది. కొత్త సినిమా స్క్రిప్ట్‌పై చర్చ పేరుతో ఆమెను మాల్వానీలోని తన నివాసానికి పిలిచిన నూరానీ.. ఆమెకు ఇచ్చిన డ్రింక్‌లో మత్తు పదార్థం కలిపి స్పృహ కోల్పోయేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, ఆ ఘటనను మొబైల్‌లో రికార్డ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వీడియోలను ఇంటర్నెట్‌లో విడుదల చేస్తానని బెదిరిస్తూ పలుమార్లు వేధించారని, ఈ విషయం పోలీసులకు లేదా కుటుంబ సభ్యులకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు ఆరోపించారు. అంతేకాకుండా బలవంతంగా గర్భనిరోధక మాత్రలు ఇచ్చినట్లు కూడా నటి ఆరోపించారు.

ఈ వేధింపుల కారణంగా తాను తీవ్ర శారీరక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని బాధితురాలు పేర్కొన్నారు. చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతూ 2026లో తిరిగి ముంబైకి వచ్చి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు మాల్వానీ పోలీసులు BNS సెక్షన్లు 64(2)(M), 123, 351(2), 88 కింద కేసు నమోదు చేశారు. ఇతర ప్రాంతాల్లోనూ నూరానీ ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో బోరివలి హాలిడే కోర్టు ఆయనకు ఆగస్టు 12 వరకు పోలీస్ కస్టడీ విధించింది.

మరోవైపు, నూరానీ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ గోర్ ఆరోపణలను ఖండించారు. తన క్లయింట్‌ను కావాలనే ఈ కేసులో ఇరికించారని, కోర్టులో నేరం రుజువయ్యే వరకు ఆయన నిరపరాధేనని వాదించారు. కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు