తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన పర్యటనకు సిద్ధమవుతున్నారు. ముందుగా రేపు ఢిల్లీకి చేరుకుని, అక్కడ జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానంతో రాష్ట్ర పాలనాపరమైన అంశాలతో పాటు పలు కీలక రాజకీయ విషయాలపై ఆయన చర్చించనున్నారు.
ఢిల్లీ సమావేశం ముగిసిన వెంటనే, అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ టూర్ సాగనుంది. ఇందులో భాగంగా ఆయన బ్రిటన్, అమెరికా దేశాల్లో పర్యటించి, పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ కార్పొరేట్ దిగ్గజాలతో ప్రత్యక్షంగా సమావేశం కానున్నారు.
ఈ పర్యటనలో తెలంగాణలోని పారిశ్రామిక అనుకూలతలు, ప్రభుత్వ రాయితీలను వివరిస్తూ పెట్టుబడుల సాధనే ధ్యేయంగా చర్చలు జరపనున్నారు. సీఎం వెంట ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్‌తో పాటు ఉన్నతాధికారుల బృందం వెళ్లనుంది. మొత్తం 11 రోజుల పాటు సాగే ఈ విదేశీ పర్యటన ముగించుకుని, సీఎం రేవంత్ బృందం ఆగస్టు 30న తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది.









