అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. 60 రోజుల కాల్పుల విరమణ గడువు ముగియడంతో, ఇరాన్ ఎటువంటి షరతులు లేకుండా పూర్తిగా లొంగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ వ్యవహారంలో తాము ఎలాంటి తొందరపాటులో లేమని, దీనికి ప్రత్యేక కాలపరిమితి ఏమీ లేదని స్పష్టం చేశారు.
అమెరికా నౌకాదళ దిగ్బంధనం వల్ల ఇరాన్ ప్రతిరోజూ వందల మిలియన్ డాలర్ల నష్టాన్ని ఎదుర్కొంటోందని, ఈ వారంలోనే మరిన్ని కఠిన ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి నియంత్రణ విషయంలో ఇరాన్, ఒమన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలను ప్రస్తావిస్తూ.. ఒకవేళ ఒమన్ అమెరికా వ్యూహాలకు అడ్డుతగిలితే వారిపై కూడా బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. అయితే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌తో తెరవెనుక చర్చలు (బ్యాక్ ఛానల్) కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఇరాన్ అణ్వాయుధ శక్తిగా మారకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేస్తూ, అవసరమైతే తమ వద్ద ఉన్న అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రయోగిస్తామన్నారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్-హమాస్ సంక్షోభంపై స్పందిస్తూ, హమాస్ అగ్రనేతలతో చర్చలు సాగుతున్నాయని, వారు క్రమంగా ఆయుధాలను వీడుతున్నారని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇకపై గాజాపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగించాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.









