వ్యక్తిగత జీవితంపై వదంతులు.. తొలిసారి మౌనం వీడిన యువ నటుడు ధ్రువ్ విక్రమ్

గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న తీవ్ర ప్రచారంపై యువ నటుడు ధ్రువ్ విక్రమ్ తొలిసారి బహిరంగంగా స్పందించారు. సహనటి అనుపమ పరమేశ్వరన్ గతంలో ఓ రెండేళ్ల రిలేషన్‌షిప్‌లో తాను ఎదుర్కొన్న నియంతృత్వం, నార్సిసిజం గురించి మాట్లాడిన తర్వాత, ఆ వ్యాఖ్యలు ధ్రువ్‌ను ఉద్దేశించినవేనంటూ నెట్టింట పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఇచ్చిన వివరణ సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఓ రౌండ్‌టేబుల్ సమావేశంలో ధ్రువ్ మాట్లాడుతూ.. ఈ ప్రచారం తనపై ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పలేనని, కచ్చితంగా ఇది తనను బాధించిందని అంగీకరించారు. అయితే ఇలాంటి క్లిష్ట సమయాల్లో వాస్తవాలకు కట్టుబడి ఉండటం, మన వ్యక్తిత్వం మరియు విలువలపై స్పష్టత కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మనం ప్రేమించే వారిని, మనకు అత్యంత ప్రాధాన్యమైన వ్యక్తులను కాపాడుకోవడమే ప్రధానమని ఆయన వివరించారు.

నిజానికి కట్టుబడి ఉన్నప్పుడు బయటివారి విమర్శలు ఒక స్థాయిని దాటి మనల్ని ప్రభావితం చేయలేవని ధ్రువ్ అభిప్రాయపడ్డారు. సెలబ్రిటీల జీవితాలపై ఇలాంటి ప్రచారాలు సర్వసాధారణమే అయినప్పటికీ, వ్యక్తిగత హద్దులను కాపాడుకోవడం అవసరమన్నారు. కాగా, ఎక్కడా అనుపమ పేరును గానీ, వారిద్దరి మధ్య రిలేషన్ ఉందన్న పుకార్లను గానీ నేరుగా ప్రస్తావించకుండా ఆయన హుందాగా మాట్లాడారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘బైసన్ కాలమాడన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు