వనపర్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. చిన్నారెడ్డిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో గాంధీ భవన్‌ను ముట్టడిస్తామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ఇటీవల గోపాల్‌పేటలో జరిగిన పార్టీ సమావేశంలో తనపై చిన్నారెడ్డి చేసిన అవినీతి ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి చిన్నారెడ్డి తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారని మేఘారెడ్డి మండిపడ్డారు. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని చిన్నారెడ్డికి టికెట్ ఎలా దక్కిందో, ఏడుసార్లు పోటీ చేసేందుకు ఎవరికి డబ్బులు ఇచ్చారో చెప్పాలంటూ ఎదురుదాడికి దిగారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నాయకులకు పనులు చేసి పెట్టాలని చిన్నారెడ్డి ప్రభుత్వ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
చిన్నారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై పూర్తి ఆధారాలతో ఏఐసీసీ, పీసీసీ, క్రమశిక్షణ సంఘంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు మేఘారెడ్డి స్పష్టం చేశారు. చిన్నారెడ్డిపై అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకునేంత వరకు తన పోరాటం ఆగదని ఆయన తేల్చిచెప్పారు.









