తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం మండల స్థాయికి విస్తరించింది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల ప్రజా పరిషత్ (MPP) కార్యాలయంలో తొలిసారిగా మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని మొత్తం 23 శాఖలకు గాను తొలిరోజు 17 ప్రభుత్వ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్ శివాజీ హాజరై ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు.
ఈ తొలి ప్రజావాణి వేదికపై ప్రజల నుంచి ప్రధానంగా 5 సమస్యలపై అర్జీలు అందాయి. మండలంలో అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్న పెస్టిసైడ్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని, రేజింతల్ గ్రామంలో మైనారిటీలకు స్మశాన వాటిక స్థలం కేటాయించాలని, ఎనికేపల్లిలో చెరువు నాలా కబ్జాను అడ్డుకోవాలని అధికారులకు వినతులు సమర్పించారు. వీటితో పాటు ‘గృహజ్యోతి’ ఉచిత విద్యుత్ సమస్య, ముబారక్‌పూర్‌లో అంగన్‌వాడీ కేంద్రానికి భవనం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.
వచ్చిన అన్ని దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరిస్తామని ఎంపీడీవో ఆంజని దేవి తెలిపారు. నూతన అంగన్‌వాడీ భవనం మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ హరిచంద్ర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శివాజీతో పాటు పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.








