ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత: సౌదీ సైనిక నౌక, ఆయుధ డిపోపై హౌతీ రెబల్స్ క్షిపణి, డ్రోన్ దాడులు

ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ రెబల్స్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యెమెన్‌లోని నైరుతి ఓడరేవు పట్టణమైన మోచా తీరంలో ఉన్న సౌదీ అరేబియా సైనిక ల్యాండింగ్ నౌకతో పాటు దానికి రక్షణగా ఉన్న నాలుగు ఎస్కార్ట్ పడవలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసినట్లు హౌతీ సైనిక అధికార ప్రతినిధి యాహ్యా సారీ ప్రకటించారు. ఈ దాడి కారణంగా సైనిక నౌకలో భారీగా మంటలు చెలరేగగా, కొన్ని రక్షణ పడవలు సముద్రంలో మునిగిపోయాయని తెలిపారు.

కేవలం నౌకలపైనే కాకుండా, యెమెన్ ఈశాన్య ప్రాంతమైన మారీబ్ ప్రావిన్స్‌లోని సైన్ అల్-జిన్ సైనిక క్యాంప్‌లో సౌదీ దళాలు నిర్వహిస్తున్న ప్రధాన ఆయుధ డిపోను లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్ దాడులు నిర్వహించారు. ఈ దాడితో సదరు ఆయుధ నిల్వల కేంద్రంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. సౌదీ అరేబియా విధిస్తున్న దిగ్బంధనానికి ప్రతిగా ‘దిగ్బంధనానికి ప్రతి దిగ్బంధనం’ వ్యూహంతోనే తాము భూమి, సముద్ర మార్గాల్లో ఈ దాడులు కొనసాగిస్తున్నామని హౌతీ వర్గాలు స్పష్టం చేశాయి.

ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌తో కలిపే కీలకమైన బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి సమీపంలో ఉన్న మోచా పోర్టు పరిసరాల్లో ఆగస్టు 9 నుంచి హౌతీలు వరుస దాడులకు పాల్పడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గానికి అత్యంత సమీపంలో ఈ దాడులు జరుగుతుండటంతో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సౌదీ బలగాల కదలికలను నిరంతరం గమనిస్తూ మరిన్ని దాడులు చేస్తామని హౌతీలు హెచ్చరించడంతో ఈ ప్రాంతంలో భద్రతా సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు