వంట గ్యాస్ కొరత రాకుండా భారత్ ముందస్తు చర్యలు: ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలకు కేంద్రం ఆదేశం

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలగడంతో భారత్ ముందస్తు చర్యలు చేపట్టింది. భారత్ దిగుమతి చేసుకునే ఎల్‌పీజీలో దాదాపు 90 శాతం ఈ మార్గం నుంచే వస్తుండటంతో, దేశంలో వంటగ్యాస్ కొరత తలెత్తకుండా కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి పెంచాలని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రిఫైనరీలను ఆదేశిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

సంప్రదాయ సరఫరా మార్గాల్లో అడ్డంకులు ఏర్పడటంతో భారత్ ఇప్పటికే అమెరికా, అల్జీరియా వంటి ప్రత్యామ్నాయ దేశాల నుంచి దిగుమతులపై దృష్టి సారించింది. అదే సమయంలో దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు నాఫ్తా వంటి పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్‌లను సాధారణ అవసరాలకు కాకుండా, ఎల్‌పీజీ తయారీకి ప్రత్యామ్నాయంగా వినియోగించాలని రిఫైనరీలకు కేంద్రం సూచించింది. అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఇబ్బందులు ఎదురైనా దేశీయ అవసరాలకు ఇబ్బంది లేకుండా చర్యలు ముమ్మరం చేసింది.

గతంలో రోజుకు సుమారు 36 వేల టన్నులుగా ఉన్న దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తిని చమురు సంస్థలు ఇప్పటికే 54 వేల టన్నులకు పెంచాయి. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా దేశీయ చమురు పరిశ్రమ రోజుకు ఏకంగా 63,810 టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని ప్రభుత్వం నూతన లక్ష్యాన్ని నిర్దేశించింది. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తాత్కాలికంగా తగ్గించి, దేశీయ ఉత్పత్తి పెంపు ద్వారా ఇంధన భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు