అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రెవార్డ్ కౌంటీలోని ఇంటర్‌స్టేట్ 95పై జరిగిన ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కకు వెళ్లి చెట్టును ఢీకొట్టింది. అనంతరం కారులో మంటలు చెలరేగడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పార్ట్‌టైమ్ పని కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
మృతుల్లో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన ఎన్. రాహుల్ ఉన్నట్లు గుర్తించారు. ఉన్నత విద్య కోసం సుమారు మూడు నెలల క్రితం అమెరికా వెళ్లిన రాహుల్.. ఎంఎస్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో చేరాడు. చదువుకుంటూనే పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. మిగతా ఇద్దరు విద్యార్థుల వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రమాదంపై స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
బుధవారం ఉదయం రాహుల్ కుటుంబ సభ్యులకు ప్రమాదం గురించి సమాచారం అందింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు రాహుల్ తన తల్లితో ఫోన్లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని స్నేహితులు పార్ట్‌టైమ్ పని కోసం తీసుకెళ్లేందుకు వచ్చిన కొద్దిసేపటికే ఈ విషాదం చోటుచేసుకుంది. రాహుల్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావడానికి సహాయం చేయాలని కుటుంబ సభ్యులు తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియలో ప్రభుత్వ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.









