పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రముఖ పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మదర్ అండ్ చైల్డ్ హెల్త్ విభాగంలోని నర్సరీలో జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పుడే జన్మించిన పసికందులు మంటల్లో చిక్కుకోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
బుధవారం తెల్లవారుజామున మూడో అంతస్తులోని నర్సరీలో ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. దీంతో క్షణాల్లోనే దట్టమైన పొగ, మంటలు నర్సరీ మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో నర్సరీలో 16 మంది నవజాత శిశువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఈ ఘటనలో పలువురు పసికందులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.









