సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన తాజా చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
ఈ వేడుకలో విజయ్ దేవరకొండ చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సందీప్ రెడ్డి వంగాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తమది కేవలం హీరో, డైరెక్టర్ బంధం కాదని, సోదరులు, స్నేహితుల కంటే కూడా తమ అనుబంధం గొప్పదని విజయ్ అన్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా సమయంలో తామిద్దరం ఎన్నో కష్టాలను ఎదుర్కొని పోరాడామని తెలిపారు. అప్పట్లో తమ వద్ద డబ్బు, పేరు, ఇన్ఫ్లుయెన్స్ ఏవీ లేకపోయినా, సందీప్ కుటుంబం తమ పొలాన్ని అమ్మి తనను నమ్మి సినిమా తీసిందని విజయ్ గుర్తుచేసుకున్నారు.
నాకోసం సందీప్, సందీప్ కోసం తాను ఎంత దూరమైనా వెళ్తామని విజయ్ దేవరకొండ భావోద్వేగంగా చెప్పారు. సందీప్ రెడ్డి వంగా పిలిస్తే ఆయన కోసం ఏ కార్యక్రమానికైనా తప్పకుండా వస్తానని తెలిపారు. సందీప్ పిలిచిన ఈ ఈవెంట్కు తాను రాకపోతే తన బతుకు వేస్ట్ అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ వేడుకలో విజయ్, సందీప్ మధ్య ఉన్న అనుబంధం మరోసారి హాట్ టాపిక్గా మారింది.









