“విద్యే జీవితాలను మార్చే మహాశక్తి!”: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటన.. విద్యా కమిషన్ ఏర్పాటుతో సమగ్ర సంస్కరణలు!

విద్యతోనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని, మనిషి జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లే శక్తి ఒక్క అక్షరానికే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చదువుకు దూరమైతే ఎంత ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ సామాజికంగా వెనుకబడే ప్రమాదం ఉంటుందని, 2024లో నిర్వహించిన సీపెక్‌ సర్వేలోనూ ఇదే స్పష్టమైందని అసెంబ్లీ వేదికగా గుర్తుచేశారు. మారుతున్న ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా రాష్ట్ర విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని, విద్యా రంగంలో లోపాలను సరిదిద్దేందుకు ప్రత్యేక విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు నూతన విద్యా విధాన మార్గదర్శకాల రూపకల్పనకు కేశవరావు కమిటీని నియమించామని వెల్లడించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల స్థితిగతులపై సీఎం సమగ్ర గణాంకాలను సభ ముందుంచారు. ప్రస్తుతం తెలంగాణలో 28,163 ప్రభుత్వ విద్యాసంస్థలు ఉండగా, వాటిలో 28.77 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, వారికి 1.57 లక్షల మంది బోధనా సిబ్బంది సేవలందిస్తున్నారని తెలిపారు. జెన్ జీ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాల భవిష్యత్తును తరగతి గదుల్లోనే తీర్చిదిద్దుతామన్నారు. కేంద్ర విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాల్సి ఉండగా, తెలంగాణలో ప్రతి 17 మంది విద్యార్థులకే ఒక టీచర్ (1:17 నిష్పత్తి) అందుబాటులో ఉండటం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు.

ఉపాధ్యాయ నియామకాల్లో గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం 7,857 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తే, తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 11 వేల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని సీఎం గుర్తుచేశారు. ఎలాంటి అవినీతి, చిన్న ఆరోపణలకు కూడా తావులేకుండా కేవలం 55 రోజుల రికార్డు వ్యవధిలోనే 10,600 మంది టీచర్లకు స్వయంగా నియామక పత్రాలు అందించామని పేర్కొన్నారు. గతంలో తగ్గుతూ వచ్చిన బడ్జెట్ కేటాయింపులను భారీగా పెంచుతున్నామని, పండిట్ నెహ్రూ ఆలోచనా విధానంతో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు