బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, బచ్చన్ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత ఆ కుటుంబంలో చోటుచేసుకున్న మార్పులపై అభిషేక్ బచ్చన్ సోదరి శ్వేతా బచ్చన్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట మళ్లీ వైరల్‌గా మారాయి. ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ పాత ఎపిసోడ్లో హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు అభిషేక్ స్పందిస్తూ.. పెళ్లయ్యాక తన జీవితంలో పెద్దగా మార్పులేమీ రాలేదని చెప్పారు. అయితే శ్వేతా బచ్చన్ జోక్యం చేసుకుంటూ ఒక కుటుంబంలోకి కోడలి రూపంలో కొత్త వ్యక్తి ప్రవేశించినప్పుడు బాధ్యతలు, పాత్రల సమీకరణాలు కచ్చితంగా మారతాయని స్పష్టతనిచ్చారు.
అభిషేక్‌కు తోడుగా నిలవడంపై శ్వేత ఎంతో సానుకూలంగా స్పందిస్తూ.. “ఒకరి మద్దతు కన్నా ఇద్దరి అండ ఉండటం ఎప్పుడూ మంచిదే” అని పేర్కొన్నారు. ఐశ్వర్య కూడా సినీ రంగానికి చెందిన నటి కావడంతో ఒక నటుడిగా అభిషేక్ పనివేళలను, వృత్తిపరమైన ఒత్తిళ్లను ఎంతో సులభంగా అర్థం చేసుకోగలదని, ఇది తమ కుటుంబానికి ఎంతో మేలు చేసిందని ఆమె కొనియాడారు.
1999లో ‘ఢాయీ అక్షర్ ప్రేమ్ కే’ ఫోటోషూట్ సందర్భంగా తొలిసారి కలుసుకున్న అభిషేక్, ఐశ్వర్య రాయ్‌లు 2007 ఏప్రిల్ 20న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2011లో ఆరాధ్య జన్మించింది. ఎన్నో ఏళ్ల క్రితం నాటి ఈ సంభాషణ ఇప్పుడు బచ్చన్ ఫ్యామిలీ రిలేషన్స్‌పై వస్తున్న ఊహాగానాల వేళ మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.









