పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజే తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన అనుచరులు, అభ్యర్థులతో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకున్న సమయంలో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి వైసీపీ శ్రేణులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ స్పష్టం చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల నిబంధనల మేరకు నామినేషన్ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిలోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన అనుచరులు సుమారు 100 మందితో ఆరు వాహనాల్లో వచ్చి, అక్కడి పోలీస్ స్టాపర్లు, గేట్లను అతివేగంగా ఢీకొట్టుకుంటూ లోపలికి చొచ్చుకెళ్లారు. దీనిపై అక్కడే ఉన్న టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. అదే సమయంలో ఒక వాహనం అజాగ్రత్తగా, వేగంగా జనంపైకి దూసుకురావడంతో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి, గుంపును చెదరగొట్టి ఎంపీని ఒక గదిలో ఉంచి పరిస్థితి సద్దుమణిగిన అనంతరం సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గట్టిగా హెచ్చరించారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి డీఎస్బీవీ స్వామి తీవ్రంగా స్పందిస్తూ పుంగనూరులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనతో పుంగనూరులో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.
Post Views: 5









