ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం వేడెక్కిన వేళ, తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్షేత్రస్థాయి బూత్ కార్యకర్తలతో మాట్లాడిన ఆయన, రాజకీయ వ్యవస్థలో జగన్ లాంటి క్రిమినల్ లిటిగెంట్లు ఉండటం అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. తానే స్వయంగా విధ్వంసాలకు పాల్పడుతూ, మళ్లీ తానే న్యాయస్థానాలను ఆశ్రయించే వికృత మనస్తత్వం కేవలం జగన్‌కు మాత్రమే సొంతమని తీవ్రంగా మండిపడ్డారు.
వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణించిన చంద్రబాబు, కేవలం రాష్ట్ర అభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే ఆ పార్టీ ఏకైక లక్ష్యంగా మారిందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలనే కాకుండా గతంలో మెగా డీఎస్సీ, రాజధాని అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను నిలిపివేయించేందుకు వైఎస్సార్సీపీ నేతలు వందల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశారని గుర్తుచేశారు. ఓటర్ల జాబితా, బీసీ రిజర్వేషన్లపై కోర్టులను ఆశ్రయించి ఎన్నికలను అడ్డుకునే కుట్రలు పన్నారని, బెంగళూరులో కూర్చొని విధ్వంసాలకు ప్రణాళికలు రచిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి అల్లరిమూకలను రప్పించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల ప్రచారానికి కేవలం వారం రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలతో పూర్తి సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో వివరిస్తూనే, వైసీపీ సాగిస్తున్న అరాచకాలను, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను గట్టిగా ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు.
Post Views: 4









