పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో రేపే బలపరీక్ష (ఫ్లోర్ టెస్ట్) నిర్వహించినా తమ ప్రభుత్వానికి ఏకంగా 275 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలోని చోర్‌బగాన్ దుర్గాపూజ తొక్కిసలాట బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) టికెట్‌పై గెలిచిన 64 మంది శాసనసభ్యులు కూడా తమకే ఓటు వేస్తారని, దీంతో 294 స్థానాలున్న అసెంబ్లీలో తమ సంఖ్యాబలం 275కి చేరుతుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా భవానీపూర్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తన విజయాన్ని ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం సోషల్ మీడియా ప్రచారాలు లేదా టీవీ చర్చల ద్వారా అధికారంలోకి రాలేదని, ప్రజలు నేరుగా ఎన్నుకున్న ‘సనాతన’ ప్రభుత్వమని సువేందు అధికారి పేర్కొన్నారు. గత 49 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌ను పాలించిన వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సృష్టించిన సమస్యలను, పేరుకుపోయిన అవినీతిని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే క్రమంగా పరిష్కరిస్తోందని ఆయన తెలిపారు.
బెంగాల్ అసెంబ్లీలో 15 ఏళ్ల టీఎంసీ పాలనకు తెరదించుతూ బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత, విపక్ష టీఎంసీలో అంతర్గత సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. పార్టీలో తలెత్తిన విభేదాలు, గుర్తు కోసం ఓ వర్గం న్యాయపోరాటం చేస్తున్న ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. 64 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమకు మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారంటూ సీఎం సువేందు అధికారి చేసిన ప్రకటన బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
Post Views: 3









