సూడాన్-దక్షిణ సూడాన్ సరిహద్దుల్లో ఘోర విషాదం: అబ్యే మార్కెట్‌పై డ్రోన్ దాడి.. ఇంధన డిపో పేలి 153 మంది దుర్మరణం!

సూడాన్ మరియు దక్షిణ సూడాన్ దేశాల మధ్య తీవ్ర వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన అబ్యేలోని ప్రధాన మార్కెట్‌పై భీకర డ్రోన్ దాడి జరిగింది. అబ్యే పట్టణానికి ఉత్తర దిక్కున ఉన్న అమియెట్ మార్కెట్‌తో పాటు సమీపంలోని ఇంధన డిపోను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరగడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటివరకు కనీసం 153 మంది సజీవదహనమయ్యారని అబ్యే పరిపాలన తాత్కాలిక సమాచార శాఖ మంత్రి యోహన్నా అకోల్ న్గోర్ వెల్లడించారు. మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ భయానక దాడికి సూడాన్ సైన్యమే కారణమని దక్షిణ సూడాన్ తీవ్రంగా ఆరోపించింది. స్థానిక వ్యాపారాలకు ఇంధనాన్ని సరఫరా చేసే కీలక డిపోపై సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, ఇది మానవత్వానికే గొడ్డలిపెట్టు లాంటి చర్య అని పేర్కొంది. ఈ దారుణంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ దక్షిణ సూడాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సూడాన్ రాయబారిని పిలిపించి వివరణ కోరింది. సరిహద్దుల్లో పౌరుల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు కలిగించే దాడులకు తక్షణమే స్వస్తి పలకాలని, సరిహద్దు సమస్యలను దౌత్య మార్గాల్లో మాత్రమే పరిష్కరించుకోవాలని సూడాన్ పాలకులను గట్టిగా డిమాండ్ చేసింది.
మరోవైపు అంతర్జాతీయ వైద్య సహాయ సంస్థ డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (MSF) రంగంలోకి దిగి స్థానిక అమెత్ బెక్ ఆసుపత్రిలో క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందిస్తోంది. దాడిలో తీవ్రంగా కాలిన గాయాలతో ఇప్పటివరకు 20 మందికి పైగా ఆసుపత్రిలో చేరారని, వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని MSF ప్రతినిధి డాక్టర్ క్రిస్టియన్ లిండౌర్ తెలిపారు. ఏప్రిల్ 2023 నుంచి సూడాన్ సైన్యానికి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధం ఇప్పుడు సరిహద్దు ప్రాంతాలకు విస్తరించి తీవ్ర ప్రాణనష్టానికి దారితీస్తోందని, నిస్సహాయ పౌరులు, పౌర ఆస్తులపై దాడులను అన్ని పక్షాలు వెంటనే నిలిపివేయాలని స్వచ్ఛంద సంస్థలు ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు