ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతల అరెస్టు వ్యవహారం భారతీయ జనతా పార్టీలో తీవ్ర అంతర్గత చర్చకు, మాటల యుద్ధానికి దారితీసింది. కేంద్ర ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కును అణచివేయడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేశారు. 2011లో రామ్లీలా మైదానంలో నిరసనకారులపై జరిగిన అర్ధరాత్రి పోలీసు చర్యలను అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా తప్పుబట్టిన విషయాన్ని ఈ సందర్భంగా అన్నామలై గుర్తు చేశారు.
సీజేపీ విధానాలతో తాను ఏకీభవించకపోయినా, రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని అన్నామలై పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని ప్రతిసారీ దేశ వ్యతిరేకులుగా, విదేశీ శక్తుల ఏజెంట్లుగా ముద్ర వేయడం విసుగు తెప్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో 12 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న బలమైన ప్రభుత్వం ఇంకా అంతర్గతంగా శత్రువులను సృష్టించుకుంటూ పోవడం మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.
అన్నామలై వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ నేత వినోద్ సెల్వం తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేశారు. ప్రజా శాంతిని, శాంతిభద్రతలను కాపాడటం కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన ఎవరికీ చట్టాన్ని ఉల్లంఘించే వెసులుబాటు ఉండదని, 2011 నాటి పరిస్థితులను 2026 నాటి పోలీసు చర్యలతో పోల్చడం తగదని బదులిచ్చారు. నిరసనకారుల హక్కులతో పాటు సామాన్య ప్రజల దైనందిన జీవితానికి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా పాలకులపై ఉందని సెల్వం తేల్చిచెప్పారు.
Post Views: 1









