అప్రమత్తంగా ఉండాల్సిన జిల్లాలు ఇవే..
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం (ఏప్రిల్ 21) భిన్నమైన వాతావరణం ఉండబోతోందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల మరియు అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేశారు. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నప్పుడు చెట్ల కింద ఉండరాదని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు.
46 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక..
రాష్ట్రంలో వర్ష సూచన ఉన్నప్పటికీ, మెజారిటీ ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగానే ఉండనుంది. మంగళవారం నాడు 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 29 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీస్తాయని అధికారులు స్పష్టం చేశారు. బుధవారం ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, సుమారు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరించారు. సోమవారమే పార్వతీపురం మన్యం జిల్లాలో 44.2°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు 289 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడం గమనార్హం.
ఎండదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి మరియు గొడుగు లేదా టోపీని వెంట ఉంచుకోవాలి. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు దాహం వేయకపోయినా తరచుగా నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు లేదా పళ్ల రసాలు తీసుకోవాలి. ఆహారంలో నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీరదోసకాయ వంటి వాటిని చేర్చుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.









