సోషల్ మీడియా యుగంలో పెళ్లి సంబంధాల కోసం కొందరు పెడుతున్న నిబంధనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా 37 ఏళ్ల వయస్సు ఉండి, ఇప్పటికే విడాకులైన ఒక ఐఐటియన్ (IITian) తన రెండో పెళ్లి కోసం పెట్టిన షరతులు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒక బిలియన్ డాలర్ల కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తి, తనకు కాబోయే భార్య 30 ఏళ్ల లోపు ఉండాలని, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెంది ఉండాలని మరియు ఆమెకు ఎటువంటి గతం లేని ‘వర్జిన్’ అయి ఉండాలని కోరడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
ప్రముఖ మ్యాచ్ మేకర్ ఓంద్రిలా కపూర్ ఈ వింత ఉదంతాన్ని సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చారు. తనకు గతంలో పెళ్లై విడాకులైనప్పటికీ, అవతలి వ్యక్తికి మాత్రం గతం ఉండకూడదనడం ఏంటని ఆమె ప్రశ్నించగా.. సదరు వ్యక్తి వితండవాదం చేయడం గమనార్హం. ఎక్కువ మందితో సంబంధాలు ఉన్న మహిళలు భవిష్యత్తులో మోసం చేసే అవకాశం ఉంటుందని ఏదో ఒక రీసెర్చ్ చెబుతోందని, తాను పురుషుడిని కాబట్టి తనకు ఈ నిబంధనలు వర్తించవని అతను వాదించడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. చదువు సంస్కారాన్ని ఇవ్వాలి కానీ ఇలాంటి అహంకారాన్ని కాదని పలువురు మండిపడుతున్నారు.
చివరికి ఆ మ్యాచ్ మేకర్ సదరు వ్యక్తి అభ్యర్థనను తోసిపుచ్చారు. ఇలాంటి పాతకాలపు పితృస్వామ్య ఆలోచనలతో మహిళల జీవితాలతో ఆడుకోవద్దని ఆమె అతనికి ముఖం మీదే స్పష్టం చేశారు. ఇప్పటికే షాదీ.కామ్ వంటి వేదికల్లో సంబంధాలు వస్తున్నా, వారు తనను మోసం చేస్తున్నారేమోనన్న భయంతోనే తాను మ్యాచ్ మేకర్‌ను ఆశ్రయించానని అతను చెప్పుకొచ్చాడు. అయితే ఈ వార్త వైరల్ కావడంతో, పితృస్వామ్య భావజాలం మరియు ద్వంద్వ నీతిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.









