తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి అభివృద్ధి ప్రాజెక్టులోనూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఏకంగా 15 శాతం కమీషన్ డిమాండ్ చేస్తోందని, ఇది అవినీతి పరాకాష్ఠ అని ఆయన ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన ఈ ప్రభుత్వం, కేవలం సొంత ఖజానాను నింపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తోందని తీవ్రంగా ధ్వజమెత్తారు.
తన ఆరోపణలకు బలం చేకూరుస్తూ, ఆర్వీఎం కన్స్ట్రక్షన్స్ సంస్థ ఎండీ రాసినట్లు చెబుతున్న ఒక లేఖను కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) రేడియల్ రోడ్-2 టెండర్ల ప్రక్రియలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. సుశీ ఇన్ఫ్రా లాంటి అర్హత కలిగిన సంస్థలను ఉద్దేశపూర్వకంగానే అనర్హులుగా ప్రకటించి, ప్రభుత్వ పెద్దలకు కావలసిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆక్షేపించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా, ముందుగా ముడుపులు చెల్లించిన తర్వాతే బిల్లులు విడుదల చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ కమీషన్ల దందా కారణంగానే రాష్ట్రంలో అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు రైతులు, సామాన్య ప్రజలు, మౌలిక వసతుల కల్పనను గాలికి వదిలేసి, కేవలం వ్యక్తిగత లాభాలు మరియు దోపిడీపైనే పూర్తి దృష్టి సారించారని ఆయన మండిపడ్డారు.








