పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికాల మధ్య దాడుల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఇజ్రాయెల్ సరికొత్త యుద్ధ రంగాన్ని ఎంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా సాగిస్తున్న పోరాటంలో తాము కూడా భాగస్వామ్యం అవుతామంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సౌదీకి ప్రతిపాదన పంపారు. అయితే, ఇజ్రాయెల్ సైనిక జోక్యానికి సంబంధించి నెతన్యాహు చేసిన ఈ ఆఫర్‌ను సౌదీ అరేబియా యువరాజు, దేశ అధినేత మహమ్మద్ బిన్ సల్మాన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారని దౌత్య వర్గాలను ఉటంకిస్తూ ఇజ్రాయెల్ పత్రిక ‘హారెట్జ్’ (Haaretz) కథనం వెల్లడించింది.
యెమెన్ యుద్ధంలోకి ఇజ్రాయెల్ సైన్యాన్ని ఆహ్వానిస్తే సౌదీ ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతుందనే ఉద్దేశంతోనే ప్రిన్స్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అమెరికా మిత్రదేశాలైన సౌదీ, ఇజ్రాయెల్ మధ్య సైనిక సహకారం ఏర్పడితే భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సాధారణ దౌత్య సంబంధాలకు మార్గం సుగమం అవుతుందని టెల్ అవీవ్ ఆశించినప్పటికీ, సౌదీ తిరస్కరణతో ఆ ప్రయత్నాలకు గండిపడింది. స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటు సహా పాలస్తీనా సమస్య పరిష్కారమైతేనే ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు సాధ్యమని రియాద్ మొదటి నుంచీ స్పష్టం చేస్తుండగా, నెతన్యాహు మాత్రం పాలస్తీనా దేశ ఏర్పాటును బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.
మరోవైపు చమురు సంపన్న సౌదీ అరేబియా విమానయాన రంగాన్ని లక్ష్యంగా చేసుకుని హౌతీ రెబల్స్ వరుస డ్రోన్, క్షిపణి దాడులకు తెగబడుతుండటంతో రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయడం వంటి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ, సౌదీ సార్వభౌమాధికారం, ప్రాంతీయ రాజకీయాల దృష్ట్యా ఇజ్రాయెల్ సైనిక మద్దతును స్వీకరించడానికి సౌదీ నాయకత్వం ససేమిరా అంటోంది. 2023లోనే ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి చేరువైనా, పాలస్తీనా వివాదం తేలకుండా ఇజ్రాయెల్‌తో చేతులు కలిపే ప్రసక్తే లేదని రియాద్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసినట్లయింది.









