రాష్ట్రంలో ప్రజలు, రైతాంగం తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతుంటే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన ఫామ్‌హౌస్‌కు ప్రత్యేకంగా నీటిని తరలించుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొండపోచమ్మ సాగర్ నుంచి పంచపాండవుల చెరువుకు ప్రత్యేకంగా కాలువ తవ్వి, అక్కడి నుంచి భారీ మోటార్ల ద్వారా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటిని పంపింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏ పౌరుడికీ లేని ఈ ప్రత్యేక వెసులుబాటు కేవలం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మాత్రమే ఎందుకు కల్పించారో తేల్చేందుకు, దీనిపై సమగ్ర నిజనిర్ధారణ విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై మంత్రులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శాస్త్రవేత్తలు హెచ్చరించిన విధంగానే ఎల్ నినో ప్రభావంతో భవిష్యత్తులో రాష్ట్రంలో తీవ్ర నీటి, విద్యుత్ కొరత తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే గడ్డు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు యాసంగిలో వరి సాగుకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి విధానాలపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్ల కోసమే లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని, ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీని కూల్చి మళ్లీ నిర్మించాలని కేంద్ర నిపుణులు నివేదిక ఇచ్చే పరిస్థితి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా, 2015లో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేవలం 299 టీఎంసీలకు పరిమితం చేస్తూ సంతకాలు చేసింది ఎవరో ప్రజలకు సమాధానం చెప్పాలని, గత పదేళ్ల పాలనలో కృష్ణా బేసిన్లో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని కేసీఆర్‌ను సూటిగా నిలదీశారు.









