ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేస్తున్న ఆందోళనలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల అరెస్టును తీవ్రంగా ఖండించిన జగన్.. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ ఎన్నికల వివాదంపై జగన్ తొలిసారి స్పందిస్తూ విపక్షాల వైపు నిలవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది.
జగన్ వ్యాఖ్యలపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘వైఎస్ జగన్.. గెలిస్తే ఒకలా, ఓడిపోతే మరోలా మాట్లాడుతారా?’ అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటు ప్రశ్నలతో నిలదీశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్సభ స్థానాలు గెలుచుకున్నప్పుడు కూడా కేంద్రంలో ఇదే ప్రభుత్వం, ఇదే ఎన్నికల సంఘం ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. గెలిచినప్పుడు వ్యవస్థలన్నీ సవ్యంగా ఉన్నాయని భావించి, ప్రజలు తిరస్కరించి ఓడించగానే ఎన్నికల ప్రక్రియ అంతా లోపభూయిష్టంగా మారిపోయిందా అంటూ ఎద్దేవా చేశారు.
న్యాయవ్యవస్థను, బెయిల్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని చట్టపరంగా అదుపులోకి తీసుకుంటే వారికి జగన్ సానుభూతి ప్రకటించడం విడ్డూరంగా ఉందని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను, సామాన్యులను అన్యాయంగా జైళ్లలో పెట్టి గొంతులు నొక్కిన విషయాన్ని జగన్ మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు. జగన్ హయాంలో అక్రమ కేసులతో వేధింపులకు గురైన బాధితులందరి జాబితాను తాను సిద్ధం చేయమంటారా అంటూ మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.









