హైదరాబాద్ నగరంలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ), తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఈ ఆకస్మిక వర్షం ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. వేడి గాలుల స్థానంలో చల్లటి గాలులు వీయడంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది.
అయితే, ఒకవైపు వర్షం ఆనందాన్నిచ్చినా మరోవైపు నగరంలో ట్రాఫిక్ కష్టాలను కూడా తెచ్చిపెట్టింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం కారణంగా పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించి, గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది.
ప్రస్తుతం నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఉపరితల ఆవర్తనం, వాతావరణ మార్పుల ప్రభావం వల్ల రాబోయే మరికొన్ని గంటల్లో నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈదురుగాలులు, వర్షం పడే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని అధికారులు సూచించారు.









