దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వంపై తాము చేపట్టిన ఉమ్మడి పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని ‘ఇండియా’ కూటమి స్పష్టం చేసింది. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలతో పాటు సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ) సహా పలు విపక్ష పార్టీల ప్రతినిధులు, పౌర సంఘాల నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఓట్ల దొంగతనం ఆరోపణల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రాజ్యాంగ వ్యవస్థలు, న్యాయవ్యవస్థ స్పందించినా స్పందించకపోయినా తమ రాజకీయ, ప్రజా ప్రతిఘటన కొనసాగుతుందని, అంతిమంగా ప్రజాస్వామ్యమే విజయం సాధిస్తుందని తేల్చిచెప్పారు. ఓట్ల చోరీ కుట్రకు ప్రధాన రూపశిల్పి ప్రధాని మోదీ కాగా, దాన్ని అమలు చేసిన వ్యక్తులు అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ అని ఆరోపించారు. వారి చుట్టూ క్రమంగా ఉచ్చు బిగుస్తోందని, రాజ్యాంగాన్ని దెబ్బతీసిన వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతి ఒక్కరినీ న్యాయస్థానం బోనులో నిలబెడతామని రాహుల్ ఘాటుగా హెచ్చరించారు.
మరోవైపు, దేశ రాజధానిలో శాంతియుత నిరసనలకు కేంద్ర బిందువైన చారిత్రక జంతర్ మంతర్ వద్ద ధర్నాలను నిషేధించడాన్ని విపక్ష నేతలంతా ముక్తకంఠంతో ఖండించారు. ప్రజల గళాన్ని అణచివేయడానికే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సీపీఐ నేత డి. రాజా మండిపడ్డారు. జంతర్ మంతర్ హోదాను తిరిగి సాధించేందుకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మార్చ్ చేపడతామని స్పష్టం చేశారు. సీఈసీని పదవి నుంచి తప్పించి, ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉద్యమం ఉధృతంగా సాగుతుందని కూటమి నేతలు ప్రకటించారు.
Post Views: 2









