ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ‘స్వాతి రెడ్డి’ (గౌతమి శ్వేత కోట) నియమితులయ్యారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం అమరావతి నుంచి మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో, ఆమె సోషల్ మీడియా వేదికగా పార్టీ సిద్ధాంతాలకు గట్టిగా కట్టుబడి నిలిచారు. వేలాది మంది నుంచి ఆన్లైన్ ట్రోలింగ్, తీవ్రమైన వేధింపులు ఎదురైనప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా నిక్కచ్చిగా పార్టీ తరఫున తన గళాన్ని వినిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీ క్లిష్ట సమయంలో వెన్నుదన్నుగా నిలిచిన అసలైన కార్యకర్తలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో అధిష్ఠానం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే స్వాతిరెడ్డి చేసిన పోరాటాన్ని, అందించిన సేవలను గుర్తించి రాష్ట్ర మహిళా కమిషన్లో సభ్యురాలిగా అత్యంత కీలకమైన బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. నిబద్ధతతో పనిచేసిన ఒక సాధారణ కార్యకర్తకు మహిళా కమిషన్లో ఉన్నత స్థాయి పదవి దక్కడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా విభాగం విస్తృతంగా హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
తన నియామకంపై స్వాతిరెడ్డి భావోద్వేగంగా స్పందిస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో గుర్తించిన అధినేతలకు సదా రుణపడి ఉంటానని, మహిళా హక్కుల పరిరక్షణలో ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. అలాగే “కార్యకర్తే అధినేత” అని లోకేశ్ అన్న చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజమని రుజువయ్యాయని, కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూనే ఉంటానని ఆమె తేల్చిచెప్పారు.









