ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది పెట్రోల్ బంకులు మూతపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టాక్ ఉన్న కొద్దిపాటి బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ భయంతో వినియోగం పెరగడం, ప్రజలు భయాందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం వల్ల ఈ కృత్రిమ కొరత ఏర్పడిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.
ఈ కొరత ప్రభావం రైతాంగంపై తీవ్రంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వరి కోతల సమయం కావడంతో హార్వెస్టర్లకు డీజిల్ దొరకక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఇంధన కష్టాలు తోడవడంతో వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. దీనికి తోడు నయారా, రిలయన్స్ వంటి ప్రైవేట్ కంపెనీలు సరఫరా నిలిపివేయడం సమస్యను మరింత జటిలం చేసింది. సాధారణ రోజుల్లో కంటే పెట్రోల్ వినియోగం 34 శాతం, డీజిల్ వినియోగం 16 శాతం అదనంగా పెరగడం గమనార్హం.
పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. సోమవారం నాటికి ఎక్కడా ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదని, ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా డీజిల్ కోసం కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.









