పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ తనపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టే క్రమంలో అమెరికా మిత్రదేశాలకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. తమ చమురు బావులు లేదా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే, దానికి మద్దతు ఇచ్చే దేశాలకు నాలుగు రెట్లు నష్టం జరిగేలా చూస్తామని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సాఘాబ్ ఎస్ఫహానీ స్పష్టం చేశారు. “మా లెక్కలు వేరేలా ఉంటాయి.. మా ఒక చమురు బావి దెబ్బతింటే, ప్రత్యర్థికి చెందిన నాలుగు చమురు బావులను ధ్వంసం చేస్తాం” అని ఆయన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఒత్తిడిని మరింత పెంచుతున్నారు. ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థికంగా కుప్పకూలుతోందని, హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని వారు కోరుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ చమురు సరఫరా సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తామని, ఇదే పరిస్థితి కొనసాగితే ఆ దేశం మరింత క్లిష్ట స్థితికి చేరుకుంటుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్ రోజుకు 500 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నష్టపోతోందని, వారి సైన్యం కూడా జీతాల కోసం ఇబ్బంది పడుతోందని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ వివాదం అంతర్జాతీయంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హర్మూజ్ జలసంధి మూసివేత లేదా చమురు క్షేత్రాలపై దాడులు జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తవచ్చు. శాంతి చర్చల కోసం పాకిస్థాన్ వంటి దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మరియు బెదిరింపులు తగ్గకపోవడం యుద్ధ మేఘాలను మరింత దట్టం చేస్తోంది. ఒకవైపు ట్రంప్ ఆర్థిక దిగ్బంధనం ద్వారా ఇరాన్‌ను లొంగదీసుకోవాలని చూస్తుంటే, మరోవైపు ఇరాన్ తన సైనిక సామర్థ్యంతో సవాల్ విసురుతోంది.









