చమురు ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్), అలాగే ఒపెక్ ప్లస్ గ్రూపుల నుంచి వైదొలుగుతున్నట్లు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని యూఏఈ వెల్లడించింది. సుదీర్ఘకాలంగా ఈ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న యూఏఈ తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయం.. ఒపెక్ కూటమికి, ముఖ్యంగా ఆ కూటమికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు పెద్ద దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒపెక్ ఏర్పాటైన ఏడేళ్ల తర్వాత, అంటే 1967లో యూఏఈ అందులో సభ్యదేశంగా చేరింది. సౌదీ అరేబియా, ఇరాక్ దేశాల తర్వాత చమురు ఎగుమతుల్లో మూడో అతిపెద్ద దేశంగా యూఏఈ కొనసాగుతోంది. ఇన్నేళ్లుగా ఒపెక్ తీసుకునే కీలక నిర్ణయాల్లో యూఏఈది ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్ర. అలాంటిది, ఇన్ని దశాబ్దాల తర్వాత కూటమి నుంచి బయటకు రావడం అంతర్జాతీయ చమురు మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ నిర్ణయానికి గల కచ్చితమైన కారణాలను యూఏఈ వెల్లడించకపోయినా, పలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ దాడుల విషయంలో సౌదీ అరేబియా మరియు ఇతర మిత్ర దేశాల స్పందన సరిగా లేదనే అసంతృప్తి యూఏఈలో ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు చమురు ఉత్పత్తి పెంపు విషయంలో సభ్య దేశాల మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు కూడా ఈ అనూహ్య నిర్ణయానికి దారితీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.









