ఆర్టీసీలో విస్తుపోయే ఘటన: రూ. 20,000 లంచం అడిగిన అధికారికి చెప్పు దెబ్బలు

హైదరాబాద్ నుంచి నారాయణ్‌ఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో లంచం అడిగిన ఒక టికెట్ ఇన్‌స్పెక్టర్‌కు ప్రయాణికులు, కండక్టర్ కలిసి దేహశుద్ధి చేసిన ఘటన కలకలం రేపింది. రాయికోడ్ వద్ద బస్సును తనిఖీ చేసిన స్క్వాడ్ అధికారులు, ఒక ప్రయాణికుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం రూ. 500 జరిమానా విధించాల్సి ఉండగా, సదరు ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ప్రయాణికుడిని, కండక్టర్‌ను ఏకంగా రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు.

అధికారి చేసిన ఈ భారీ డిమాండ్‌తో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. బస్సులో రద్దీ ఎక్కువగా ఉండటం వల్లే టికెట్ ఇవ్వడం సాధ్యపడలేదని కండక్టర్ వివరించినప్పటికీ అధికారి వినకపోవడంతో వివాదం చెలరేగింది. దీంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు, కండక్టర్ కలిసి ఆ టికెట్ ఇన్‌స్పెక్టర్‌ను చెప్పులతో కొట్టి బుద్ధి చెప్పారు. లంచగొండితనంపై సామాన్యుల్లో ఉన్న అసహనానికి ఈ ఘటన అద్దం పడుతోంది.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైనది కాకపోయినప్పటికీ, బహిరంగంగా అంత పెద్ద మొత్తంలో లంచం అడగడంపై ప్రజలు మండిపడుతున్నారు. నిత్యం కష్టపడి పనిచేసే సామాన్యులను పీల్చి పిప్పి చేసే ఇలాంటి వ్యవస్థలపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు