స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మా ఇంటి బంగారం’ విడుదల తేదీ మారింది. ముందుగా ప్రకటించిన ప్రకారం మే 15న రావాల్సిన ఈ చిత్రం, ఇప్పుడు జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకోవడం, క్రికెట్ ఫీవర్ పీక్స్‌లో ఉండటంతో ఆ ప్రభావం సినిమా వసూళ్లపై పడకూడదనే ఉద్దేశంతో చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఉన్న క్రేజ్, ఐపీఎల్ వేడిని దృష్టిలో ఉంచుకుని డిస్ట్రిబ్యూటర్లు చేసిన విన్నపం మేరకు సినిమాను వాయిదా వేశామని నిర్మాణ సంస్థ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో సమంత గన్ పట్టుకుని రగ్డ్ లుక్‌లో కనిపిస్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ఓ బేబీ’ వంటి హిట్ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
రాజ్ నిడిమోరు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సమంత తొలిసారి నిర్మాతగా మారి తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమా కావడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గన్‌తో ఉన్న సమంత లుక్ చూస్తుంటే ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ప్రశాంతంగా ప్రేక్షకుల ముందుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.









